తెలుగు
భాషా ? భవిష్యత్తా ??
“మనకు మనం న్యాయవాదులం,
ఎదుటివారికి తీర్పరులం” అని మొన్న ఎక్కడో
చదివినట్టు గుర్తు. ఇది నేడు స్వార్ధపు వాదన చేస్తున్న స్వయం
ప్రకటిత భాషావాదులకు కుహన మేధావులకు వర్తిస్తుంది. వారు ఆంగ్లములో చదివి
అమెరికాలలో పంచభక్ష పరమానాలు తింటారు, పేదలు అర్ధాకలితో ఇక్కడ గ్రామాల్లో తెలుగును
రక్షిస్తారు, ఇదీ వారి ధోరణి . వారు ప్రైవేటు స్కూళ్ళను స్థాపిస్తారు, పోషిస్తారు,
పిల్లలను అక్కడే చదివిస్తారు, పేద పిల్లలు వివక్షల వలయంలో కొట్టు మిట్టాడుతూ,
వసతులు లేమి సాకుతో , ఉపాధ్యాయుల ఎగనామాలతో సతమతమౌతూ తెలుగు భాషను రక్షిస్తారు. అయిన
వారి పిల్లలందరూ వంద శాతం ఆంగ్ల ,
ప్రైవేట్ స్కూల్లలోనే చదివి , వారిలో ఎనభై శాతం మంది పిల్లలు అమెరికాలలోస్థిర
పడతారు. వారూ, వారి పిల్లలూ రక్షించలేని తెలుగును బడుగులు బలహీనులు అరా కొర
ప్రభుత్వ బడులలో చదివేసి బతికించాలని కోరుకోవడం ఏ దిగజారుడుతనానికి నిదర్శనం? పైగా
ఇలా వాదించడం తప్పని ఒక విదుషీ మణి విభేదించడం దీనికి పరాకాష్ట. విచిత్రం ఏమిటంటే
ఈ వాదనే తప్పట.గొప్ప కులాలు ఆంగ్ల ప్రైవేటు బడులలో చదవడం పేదలు ప్రభుత్వ తెలుగు
బడులలో చదవడం సబబే అనేది వారి ఆలోచన . భాషను రక్షిండం అందరి భాద్యత. అందులో సందేహం
లేదు. అన్నీ అనుభవిస్తున్నవారు, వసతులూ వనరులూ పుష్టిగా ఉన్నవారు దీనిని మోయాలి. దీనికి ఒకటే ప్రత్యామ్నాయం
ఇప్పుడు చేస్తున్న ఉద్యమ రూపాన్ని మార్చి మొత్తం
ప్రైవేట్ బడులలో తెలుగు మీడియంను అనివార్యం చేయాలని ఉద్యమించడం, లేదా
ప్రభుత్వం చేస్తున్న సామాజిక న్యాయాన్ని నిశ్శబ్ద విప్లవాన్ని స్వాగతించడం . ఏవో
రెండు మూడు నిర్ణయాలపై వ్యతిరేకత వచ్చింది కదా అని ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం తప్పే అనే ధోరణి మంచిది రాజకీయ అజ్ఞానమే
అవుతుంది. ఇటువంటి అంశాల ను నెత్తిన వేసుకున్నప్పుడు పత్రికలూ, మీడియా కూడా కాస్త సమభావావన్నీ ,సంయమనాన్ని,వివక్షారాహిత్యాన్ని
పాటిస్తే క్రింది వర్గాలలో పత్రికల మీద
గౌరవం పెరిగే అవకాశము ఉంటుంది.. కానీ, పత్రికలకు ఈ అవసరంలేదు, వారికి వారి రాజకీయ
ఎజెండా వారి కులాధిపత్యమే ప్రధానం , అదే నేటి ప్రజాస్వామ్యాన్ని పీడుస్తున్న పెద్ద సమస్య. మార్పును
స్వగాతిన్చాకపోవడం మనువాద లక్షణము. ప్రభుత్వ జి వో 81 స్వాగతించడంలో ఈ భాషా వాదులు
వారిని మోస్తున్న పత్రికలు వ్యతిరేకించడానికి భాషను బ్రతికించడం అనేది ఒక
సాకు గా , అంతకంటే పెద్ద రహస్య అజెండా ఉన్నట్లుగా ప్రస్పుటంగా కనబడుతుంది.
బ్రిటీషు పాలనలో ప్రారంభమైన ఈ
ఆంగ్ల విద్య బోధన దేశాన్ని ఈ మాత్రం దూరమన్నా తీసుకొచ్చింది అనేది నగ్న సత్యం.
వారు తెచ్చిన ఈ ఆంగ్లము వలను ఏ వర్గం అత్యంతముగా లబ్ది పొందినదీ, ఆనాడు ఉన్నత
పదవులు పొంది వారి అడుగుజాడల్లో నేడు విభజించి పాలించు అనే వైఖరిని ఎవరు
మోస్తున్నారో గమనిస్తే వారిప్పుడు చేస్తున్న కుట్ర పూరిత వాదనకు మూలాలు మనకు
తెలిసిపోతాయి. జాతీయ కాంగ్రెస్ వాదులు , స్వాతంత్ర్య పోరాట యోధులూ, నాటి సంఘ
సంస్కర్తలూ, తిలక్ లాంటి మత రాజకీయ వాదులూ, వివేకానందుడు, అరవిందో లాంటి మత
జాతీయవాదులూ, టాగోర్ లాంటి కవులూ ,గురజాడ,
టంగుటూరి , గిడుగు లాంటి భాషా సంస్కర్తలూ ఆరోజుల్లో కొత్తగా ఆరంభమైన ఆంగ్ల
మాధ్యమాన్ని ఎందుకు అడ్డుకోలేదో వ్యతిరేకించ లేదో ఆలోచించాల్సిన అవసరం లేదా? పైగా
వీరంతా స్వాగతించి ఆ భాషను ఔపాసన చేసారు. ఆంగ్లమే వారిని అంతర్జాతీయ ప్రముఖులుగా
చేసింది. వారంతా ఆంగ్లం నేర్చిన తర్వాతే పాశ్చ్యాత్య సంస్కృతులను తెలుసుకున్న
తర్వాతే సతి, బాల్య వివాహాలను,కన్యా శుల్కాలను వ్యతిరేకించ గలిగారన్నది ఎంత నిజమో
తెలియదా?. వారి ఆలోచనలకూ కొత్త రూపాన్నిచ్చి ఆధునీకరణను, పారిశ్రామీకరణను
ఆహ్వానించకుంటే మనం ఈనాడు ఈ అభ్యుదయాన్ని అనుభవించే వాళ్ళమా? . వారితో పాటూ పటేల్
,గాంధీ,నెహ్రూలు ఇక్కడ ఆంగ్ల బడులలో చదివారు కాబట్టే బార్ ఎట్ లా లు , లండన్
స్కూళ్ళలో ఎకనామిక్స్ లు చదవగలిగారు. వారు మనకిప్పుడు ఆరాధ్యులు కాదా? అంతెందుకు
మన దేశంలో రవాణా వ్యవస్థ, పత్రికా రంగం , టెలి కమ్యునికేషన్స్ , రైల్వేస్ సాంకేతికతకు బీజాలు వేసింది ఆంగ్ల భాష,
ఆంగ్లేయులూ కాదనగలమా? ఇప్పుడు ఈ ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న పత్రికలూ,
ఎలెక్ట్రానిక్ మీడియా లో కార్యక్రమాలలో తొంభై శాతం ఆంగ్లమే దొండ్రు తున్నది నిజం కాదా? వారిలో ఒకరిద్దరు
నడుపుతున్న విద్యాసంస్థలు కేవలం ఆంగ్లం లోనే బోధిస్తారని మీకు తెలీదా ? రామోజీ
ఫిలిం సిటీలో ఉన్న రమాదేవి పబ్లిక్ స్కూల్ ఇంగ్లీషు మీడియం బోధిస్తూ ఆ సంస్థ
పత్రిక మాత్రం తెలుగు మీద సవతి ప్రేమ
కురిపించడం వెనుక ఉన్న రాజకీయానికి సామన్యుడు బలి అవ్వాలా? ఈ వ్యాపారవేత్తలకు,
భాషా వాదులకు లకు ఎందుకీ ద్వైదీ భావన ?.
నేడు దేశమంతా వాదిస్తున్న జాతీయవాదానికి మూలాలు ఆక్కడ అప్పుడు ఆంగ్లం
నేర్పిన ఆధునిక, సామాజిక, రాజకీయ, ఆర్ధిక చైతన్యమూ, నేపధ్యమూ కారణం కాదనగలమా?
మాకు నచ్చనది, వొప్పుకో బుద్దేయనిదీ, మాకు
నష్టం కలిగించేదీ ,మేము వ్యతిరేకించేది దేశద్రోహం అనే ధోరణి దేశాన్ని ఏలుతున్న
తరుణం ఇది. ఇక్కడ భాషా ద్రోహం జరుగుతోంది అంటున్న నేటి భాషావాదుల వాదన కూడా ఇల్లు కాలిపోతుంటే చూరికిండా చుట్ట
గురించి ఆలోచన చేసినట్టు అనిపిస్తుంది. ఒక భాషావేత్త తెలుగును తల్లి పాలు తోనూ ఆంగ్లాన్నీ పోత పాలుగానూ పోల్చారు. కానీ ఆ తల్లి
సవతి ప్రేమ చూపితే, లేదా తల్లి అసమానతలను పెంచి పోషిస్తే అటువంటి తల్లి పాలతో పనేమిటి అనే ప్రశ్న వస్తుంది. బహుజనులు ప్రభుత్వ బడులకు వెళుతూ
తెలుగును ఉద్దరించడం కోసం డ్రాప్ ఔట్స్ మారి కూలి నాలి పనులకే పరిమితమైపోవాలి.
తాపీ పనులకు , సూపరవైజర్ పనులకు, మాల్స్ లో సేల్స్ గాళ్స్, బోయ్స్,పెట్రోల్ బంకుల్లో
పనివారుగా పనులకూ కుడురుకోవాలి , గాబట్టీ
వీరికి తెలుగు తెలిస్తే చాలానే భావజాలాన్ని ఏమనాలి? కుహనా మేధావితనమా? ఉపాధ్యాయులు
ఈ జి ఓ 81 ను ఒక సవాలుగా , ఈ సానుకూల పెను మార్పుగా తర్వాత తరానికి వారు
ఇచ్చే అతి పెద్ద బహుమతిగా భావించడము పోయి
భాధ్యతా రాహిత్యంగా మాట్లాడడం వారి చేతకానితనం అనుకోవాలా? అది కూడా రాజకీయమేనా?
లేదా దళిత ఆదివాసీ పిల్లలకు పెద్ద చదువు లెందుకు లే అనే నిర్లక్ష్యమా? ఉపాధ్యాయులు బి ఎడ్ చదివినవారే కదా, వారికి
ఆంగ్లం లో ప్రావీణ్యం ఉంది కదా, చాలదనుకుంటే వారికి ప్రత్యెక శిక్షణ ఇవ్వవచ్చు.
మొన్న ఆర్యులు వలస వచ్చిన కొత్తలో
మీకు చదువు అనవసరమా ? అన్నారు, చదుకున్న వారి నాలికలు కోశారు. విన్నదుకు
సీసం పోశారు. నిన్న ఆర్య అగ్ర వర్ణాల వారు మీరు చదువుకుంటే మా పనులెవరు
చేస్తారన్నారు, ఇప్పుడు ఆంగ్లములో చదవ
నీయకుండా సమాన విద్యా
ఉద్యోగావకాశాలను దూరం చేస్తున్నారు.
ఇప్పటికే స్టేట్ సిలబస్, సి బి ఎస్ ఇ, ఐ సి ఎస్ ఇ అనే అసమాన విద్యా వ్యవస్థ బహుజనులను ప్రభుత్వ స్టేట్ సిలబస్ కే పరిమితం
చేసి ఇతర జాతీయ స్థాయి సిలబస్ చదివిన విద్యార్ధులతో పోటీ పడలేని పరిస్థితిని
కల్పించారు. ఇప్పుడిప్పుడే ఈ సిలబస్ లలోని
అంతరాలను తగ్గించే దిశగా సంస్కరణలు మొదలైయాయి. మరొక ప్రక్క ఆర్ ఎస్ ఎస్ మనువాదులు
జాతీయ విద్యా విధాన ముసాయిదా ను ఏకపక్షంగా రూపొందించి విద్యా విధానాన్ని అపహాస్యం
చేసి చదువుకొనే అవకాశాలను నిర్వీర్యం చేసూ వొకేషనల్ విద్య కు పెద్దపీట
వేస్తున్నారు. ఇది కూడా గోరు చుట్టూ మీద రోకటి పోటులా బహుజనుల విద్యనూ
ప్రశ్నార్ధకం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ది తో చేసే ఈ సంస్కరణకు
ప్రభుత్వ బడులలో ఆంగ్ల విద్యా బోధన ఆరంభించడానికి సరైన సమయం. బాలారిష్టాలు తప్పవు.
సవాళ్లు తప్పవు. వాటిని అన్నిటినీ శాస్త్రీయంగా పరిష్కరించడానికి రాష్ట్ర
విద్యాశాఖ ప్రణాళిక సిద్దం చేసింది. అవేమిటో జి ఓ 81/2019లో చాలా వివరణాత్మకంగా
ఉంది. ఇక ఉపాధ్యాయులు తర్వాతి తరాలకు నూతన విద్యా బోధనతో అంతర్జాతీయ తలుపులు
తెరచి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే అద్భుత అవకాశాన్ని వదులుకో కూడదు
. పిల్లలు మరింత ఆంగ్ల మాధ్యమంలో రాణించి
ఉపాధ్యాయులకు దేశానికీ మంచి గుర్తింపు తెచ్చే అవకాశం కాలరాయకూడదు. ఈ జి ఓ ను
నిర్వీర్యం చేయాలన్న అది కూడా ఉపాధ్యాయుల
చేతిలో పని. కా నీ అటువంటి సాహసం చేస్తే ఆ ఉపాధ్యాయులు చరిత్ర హీనులౌతారు.
భాషావాదులు ప్రభుత్వ బడులలో ఆంగ్ల బోధనపై ప్రదర్శిస్తున్న వ్యతిరేకతను
కొందరు ఎందుకు విభేదిస్తున్నారో కూడా విజ్ఞులు గమనించాలి. నా వరకూ వస్తే, నేను పదవ
తరగతి వరకూ తెలుగు మీడియంలో చదివి ఇంటర్ ఆంగ్లంలో చదవాల్సి వచ్చినప్పుడు ఒక
కల్చరల్ షాక్ కు గురైయ్యాను. నా మనో వేదన చెప్ప తరము కాదు. అక్కడితో ఆగలేదు, ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరం
చేరిన తర్వాత ఆ పరిస్థితి మరీ దారుణం. ఒక ప్రక్క ఆంగ్లం రాక, మరొక ప్రక్క మాట్లాడే
సాహసం లేక, ఇంకొక ప్రక్క వైద్య పరిభాషను పలకడం చేతకాక పడ్డ యాతన ఎవ్వరికీ
చెప్పుకునేది కాదు. ఈ బాధ పడలేక ఎందఱో వైద్య విద్యార్ధులు వైద్య విద్యకు మధ్యలోనే
స్వస్తి చెప్పినవారూ ఉన్నారు, ఆత్మనూన్యతా భావానికి బల్కైనవారూ ఉన్నారు. కారణ
ఆంగ్ల మాధ్యమం లో చదువుకుని వచ్చిన వారికి ఉన్నత విద్య సునాయాసంగా సులభంగా
అనిపించి ఎక్కువ స్కోర్ చేసిన సందర్బాలు అనేకం.
మరొక ముఖ్య అంశం ఏమిటంటే దేశ వ్యాప్తంగా యూనివర్సిటీల్లో పోస్ట్
గ్రాడ్యుయేట్ విద్య ఆంగ్లం లోనే కదా నెరుపుతున్నారు. మరి అటువంటి ఉన్నత విద్యకు
పునాది ఆ మాధ్యమంలోనే జరగాలి కదా?! దీన్ని విస్మరించడం దుర్మాఘం . ఎందఱో పోస్ట్
గ్రాడ్యుయట్ విద్యార్ధులు నేటికీ ఆంగ్లంలో కమ్యునికేట్ చేయడానికి పడుతున్న అవస్థను
ఊహించుకోవడం పెద్ద గా కష్టమేమీ కాదు. అలా ఆంధ్ర యునివర్సిటీ వెళ్లి వాకబు చేస్తే
పరస్థితి ఇట్టే బోధ పడిపోతుంది. మరొక గమ్మత్తు ఏమిటంటే సందట్లో సడేమియా అన్నట్లు
డాక్టర్ అంబేద్కర్ను కూడా వాడుకోవడానికి ఈ భాషావాదులు వెనుకాడలేదు. నిత్యం అతన్ని ద్వేశించేవారు అతని రచనల్ని వక్రీకరించి
తమ వాదనకు బలంగా వాడుకోవడానికి ప్రయత్నించడం మరీ నీచం. ఆయన రచనల్లోని వాల్యూం రెండులో భాషగురించి ఆయన రాసిన మాటల్ని ఈ
కుహన వాదులు వక్రీకరించారు. అప్పటి బొంబాయి యునివర్సిటీ గురించి ప్రస్తావిస్తూ
డాక్టర్ అంబేద్కర్ “విశ్వవిద్యాలయాల్లో” బోధన మాతృ భాష ఉండాలని అయన సూచిస్తారు.
దానిని “విద్యాలయాల్లో” అని వక్రీకరించడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్
విశ్వవిద్యాలయాల్లో మాతృ భాషను సూచించడానికి గల కారణం బడుగు బలహీనులు గ్రామీణ
ప్రాతాలనుండీ విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చినప్పుడు వారికి అనువైన భాష అప్పటివరకూ
వారు మాతృ భాష లో చదువుకుని అక్కడ వరకూ వస్తారు కాబట్టి వారికి అనువుగా
ఉండాలనేదిఆయన ఆలోచనా విధానం. నేడు బడుగు
బలహీన ఆదివాసులకు ఆంగ్లంలో ఒకటవ తరగతి నుండీ ఆరవ తరగతి వరకూ చదువుకునే అవకాశాన్ని
ప్రభుత్వం కలిగిస్తూ ఒక సంస్కరణ వైపు అడుగులేస్తుంటే, భాష చచ్చిపోతుంది తద్దినం
పెడదాం రండి అని ఉద్యమించే వారిని ఎలా అర్ధం చేసుకోవాలి? ఇప్పుడు ప్రభుత్వ, జిల్లా
పరిషత్ , మండల ప్రజాపరిషత్ బడులలోనే గా ఆంగ్ల
విద్య బోధన, అక్కడ మీ పిల్లలు లేరుగా ఇక ఎందుకు అలక? నవంబర్ 7 తారీఖును
విద్యార్ధి దినంగా కొన్ని రాష్ట్ర
ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. కారణమేమిటో మనకు తెలుసు. ఆంగ్ల విద్య
ప్రాముఖ్యతను తెలుసుకోవాలంటే జ్యోతిబా, సావిత్రి భాయి జీవితాలను ఉద్యమాలను అధ్యయనం
చేయాలి .1850 ప్రాతంలోనే వారి పేదలకు ప్రాధమిక బడులలో ఆంగ్ల భాషను బోధించారు. నేడు
ఏమి చేస్తే ఈ ఆంగ్లంలో బోధనా విధానం సఫలీకృతం అవుతుందో ,అవసరమైన ప్రణాళిక ఏమిటో
ప్రభుత్వం వద్ద సిద్దంగా ఉంది, కనుక అసాధ్యం అనో, కష్టమనో ఉపాధ్యాయ సంఘాలు అపోహలు
పెంచోకోనవసరం లేదు. జి.ఓ ఒకసారి చదవండి. దానిలో ఉపాధ్యాయుల భవిష్యత్ నియామకాల
ప్రాతిపదికలను కూడా చర్చించారు. అవసరమనుకున్న చోట మార్పులూ ప్రతిపాదనలు
చేయండి. ఇక , తెలుగు భాషకు ఎప్పటికీ డోకా
లేదనే సంగతి అందరికీ తెలిసినా ఈ మిడిసిపాట్లు వెనుక ఉన్న మనువాద భావజాలన్ని
ప్రక్కన పెట్టండి.
మరీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే
“ప్రపంచ కార్మికులారా ! ఏకం కండి “ అని పిలుపునిచ్చిన మహానీయుని
వారసులమనుకుంటున్నవారు కూడా మనువాదూలకుట్రను
వ్యతిరేకించ లేకపోవడం వెనుక కులం కోణాన్ని విస్మరించలేము. మాధ్యమానికీ ,
భాషకు తేడా ఉన్నాడని, అలాగే భావ
వ్యక్తీకరణకూ భాషకూ సంబంధం లేదనీ, బాగా చదువుకోవడం ముఖ్యం కానీ ఆంగ్ల భాష ప్రధానం
కాదని, ఇతర దేశాలు తిరిగి మాత్రు భాషలో విద్య బోధిస్తున్నాయనీ చేసే అనేక వాదనలు చర్చకు నిలబడవని తెలిసి కూడా
తేరా మీదకు తేవడం వారి ద్వంద వైఖరికి నిదర్శనం.
అయినా తెలుగు భాషను బడిలోనే నేర్పాలని ఎవరు చెప్పారు, మనం మన ఇళ్ళల్లో
బిడ్డలకు తెలుగు నేర్పి దాన్ని కూడా బ్రతికించుకుందాం. మీరు అన్నట్లే స్పోకెన్
ఇంగ్లీషుకు బదులు స్పోకెన్ తెలుగు నేర్చుకుని భాషను బ్రతికించుకుందాం. పాఠశాలలో ఎలాగు
అది ఒక సబ్జెక్ట్ గా ఉండనే ఉంటుంది. దయచేసి భాష పరిరక్షణ వంక విలువైన ఆంగ్ల మీడియం
పిల్లలకు దూరం చేయవద్దు. వారి మనల్ని క్షమించరు. మనం మూర్ఖంగా మర్చిపోతున్న చివరి
ప్రధానాంశం ఏమిటంటే తెలుగులో చదువుకున్న వారు మనదేసంలోనే కనీసం ప్రక్క రాష్ట్రా నికెళ్ళి బ్రతకలేరనేది
వాస్తవం. మనదేశం మొత్తం ఒకే భాష మాట్లాడాము అనే ప్రాధమిక స్పృహ లేకుండా చేసే
వాదనలను త్రిప్పికోట్టాలి. ఇదంతా తెలుగు మీద మమకారం లేకనో , భాషావాదుల పై
వ్యతిరేకతతోనో అనడం లేదు. అవసరం అన్నిటికంటే బలమైనది. భాష కన్నా ఆశయం
గొప్పది. భాష కన్నా సమ సమాజ నిర్మాణ
స్ఫూర్తి ఇంకా గొప్పది. ఎప్పటికైనా ఏది
ప్రజలకు అవసరమో అదే నిలబడుతుంది. దీనికి ఉదాహరణలుగా సవర ,గోండు ,కొడకు భాషలు
చెప్పుకోవచ్చు. అవి నేటికీ సజీవంగానే ఉన్నాయి. అవసరం లేనిది ఎంత దైవ భాష అయినా సరే
మృత భాషే అవుతుంది. భాధ్యతాయుతమైన పౌరులుగా మనం మన భాషనూ మన బహుజన సోదరుల
భవిష్యత్తునూ సమన్వయము తో కాపాడుకుందాం.
డాక్టర్ మాటూరి శ్రీనివాస్
రచయిత, విశాఖపట్నం
ఫోన్ 9849000037
No comments:
Post a Comment