Friday, 10 April 2020

మయ సభ


                                    మయ సభ
                                                                                         డాక్టర్ మాటూరి శ్రీనివాస్

అక్కడ సమానత్వం శాస్త్రీయత చిలుకా గోరింకల్లా చెట్టా పట్టాలేసుకుంటూ
పాలూ నీళ్ళలా మమేకమై తమ ఉనికిని ఉత్సాహంగా పంచుకోవాలి
చట్టాలు స్వచ్చమైన వాన చినుకుల్లా మెరవాల్సిన చోటది
అక్కడే అంతరాలు గాల్లో దొంతరలు దొంతర్లగా పేరుకుని పాచి కంపు కొడుతున్నాయి
వినియోగదారుడైన సామాన్యుడు  నాణ్యత కోసం నిత్యం అటుగా ఎదురు చూస్తుంటాడు
అక్కడే మందిరానికి మసజీద్కు అనంతమైన దూరం ఏర్పడింది
ఒక మనిషి కి ఒక వోటు  ఒక విలువ ఉండాల్సిన చోటది
భిన్నంగా ఆర్య పితృస్వామ్య అమానుష భావజాలం
అర్ధాంతరంగా ఆ గాలరీలో పురాణ పురుషుని రూపంలో ప్రత్యక్షమైయింది
ఆ నామమే ఇప్పుడు పాలకులకు ప్రాణవాయువు .
దైవం పేరు మీద నినాదాల వారసత్వం
మారణాయుధం గా మారి ఉన్మాదానికీ  ఉన్నవాడికీ ఉనికికై
ఊర్ధ్వగతి  అందలం మీద కూర్చుని  కలకలం సృష్టిస్తోం ది
పోరాడి తెచ్చుకున్న హక్కుల రాజ్యం పరాన్నభుక్కుల పాలౌడంతో
సన్నాయి నొక్కులతో పగటి వేషగాళ్ళయిన స్వాముజీలకు చిత్తౌడం తో
 ఆ అపశ్రుతులు ప్రజాస్వామ్య గుండెల్లో బాకుల్లా దిగిబడి
 తీవ్ర క్షతిని మిగిల్చడం దేశ దురదృష్టానికి పరాకాష్ట
 అ నినాదాలిప్పుడు అల్పజీవుల చెవులలో  మరణ మ్రుదంగాలై ఘోషిస్తున్నాయ్
 పీనుగు ముందు బాజాలూ భజంత్రీల్లా వినబడుతున్నాయ్ 
రాజ్యాంగానిదిప్పుడు గాలికి చిరిగిపోయే  అరిటాకు బ్రతుకు ,
సహోదరత్వం ఎంత పిండినా కారని బూడిదపాలైన  పన్నీరు
రాజ్యాంగ పీఠిక సంక్లిష్టతల కుడితిలో పడ్డ సామ్యవాదపు ఎలుక
లౌకికానికీ అలౌకికానికీ తేడా తెల్సి కూడా తెలియనట్లు
నటించే  తేడా గాళ్ళ  చేతిలో పెనుగులాడుతున్న  పరాభవాల పరంపర.
ఇక చట్ట సభ ఈదేశ ప్రజలనెప్పటికి మభ్యపెట్టే  మయ సభే.....
                                                                                                                   02 -07-19.

No comments:

Post a Comment