Friday, 10 April 2020

వసంతం నుండీ శిశిరం వరకూ.... యు ఎ ఎన్ మూర్తి


                                                                      వసంతం నుండీ శిశిరం వరకూ.... యు ఎ ఎన్ మూర్తి
                           పేరులోనే ఎంతో భావుకత ఉంది కదూ? కానీ ఇది భావ కవిత్వం కాదు. ఒక ప్రకృతి ఆరాధకుడు తన జీవితం యావత్తు సాహిత్యానికీ దానిలోనున్న విభిన్న ప్రక్రియలకు అంకితం చేసి ఒక ఆరు నెలల ఆటవిడుపుగా కాకుండా ఆలంబన కోసం చేసిన అమెరికా ప్రయాణపు ముచ్చటల సమాహారం “ఈ వసంతం నుండీ శిశిరం వరకూ”. ఒక విద్యార్ధి అమెరికా వెళితే అక్కడి  విద్యావిధానాలు, డిగ్రీలు, ఫీజులూ, కోర్సులు గురించి ఆలోచిస్తాడు. ఒక వ్యాపార వేత్త అమెరికా వెళితే తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించుకోవాలో ప్రణాళిక వేస్తాడు. ఒక భావ కవి, రచయిత, అనువాదకుడు, సాహిత్య పరిశోధకుడు, భాష ,సౌందర్య శాస్త్ర ప్రవీణుడు ,సంప్రదాయ మరియు సమకాలీన ఆధునికాభ్యుదయ తెలుగు సాహిత్య విమర్శకు చిరునామాగా ఉన్న పరిశీలకుడు ఒక అభివృద్ధి చెందినా దేశాన్ని ఎలా అధ్యయనం చేస్తాడో తెలుసుకోవాలంటే మనం కూడా అతనితో పాటూ ఒక వసంతం నుండీ శిశిరం వరకూ ప్రయాణం చేయవలసిందే. కవిని కాకుండా అతడి/ఆమె కవిత్వాన్ని, రచయితను కాకుండా అతని /ఆమె రచనలను మాత్రమే చూసి తులనాత్మకంగా కొలవగల ఒక మేధావి ఒక దేశాన్ని ఒకే కోణం లో కాకుండా ఆ దేశ సంస్కార సంస్కృతీ సంప్రదాయాలను ,జీవన విధానాన్ని  అక్కడి ప్రకృతితో మమేకమై ఆస్వాదించడం అలాగే విషయాలను  పరిశీలన చేసే విధానం మనకు తెలుస్తుంది.   2014 ఏప్రిల్ నుండీ అక్టోబర్ మధ్య కాలం  విజయనగరం నుండీ ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి గారు అమెరికా వెళ్లి వచ్చారు. ఆయన రాసిన అనుభావాలు ఒక యాత్రాసాహిత్యంలా కాకుండా ఒక ఖండం గురించి అనేక అంశాలను అనేక కోణాల్లో విశ్లేషించిన తీరు దీనిని ఒక  పరిశీలనా సంక్షిప్త ముద్రగా  అనిపించడంలో ఆశ్చర్యం లేదు.
             అమెరికాలో ఇళ్ళు స్వతంత్ర్యంగా వైయుక్తికంగా దూరం దూరంగా ఉండి చుట్టూ  తివాచీలా పరిచిన పచ్చికతో ,ఆకాశాన్ని అంటుకుంటూ బారుగా ఎదిగిన చెట్లతో ఆహ్లాదంగా ఉంటాయి. అక్కడే విచ్చలవిడిగా తిరుగుతున్న జింకలూ లేళ్ళూ ఇతర జంతుజాలాలు  ఉండడం, ఇళ్ళ వెనుక విశాలమైన పెరటి అడవి రచయితకు  అదంతా కణ్వ మహర్షి కుటీరం అనిపిస్తుంది. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం లో వసంతం గురించి రాసినవన్నీ అక్కడ ప్రత్యక్షం అవుతున్నాయని  తన్మయత్వాన్ని పొందుతారు రచయిత. అయితే ఇక్కడ దుష్యంతులకు సల్మాన్ ఖాన్లకు ప్రవేశం లేదంటారు, వేట నిషేధాన్ని గురించి  నర్మగర్భంగా. చెట్లను నరకడం కూడా నిషేధమే, అవి సహజముగానో గాలి వానకో రాలి భూగర్భంలో కలిసిపోయి నల్ల బంగారంలా మారాల్సిందే. ప్రక్రుతి, పర్యావరణం ,కాలుష్య నివారణ, జీవ కారుణ్య ఇక్కడ ప్రజలకు సహజసిద్ధంగా అబ్బిన సామాజిక బాధ్యతలని గుర్తు చేస్తారు. రోడ్ల మీద వందల కొద్దీ కార్లు కదులుతున్నా తూనీగా రెక్కల చప్పుడంత శబ్దం  కూడా రాదు. అగరు బత్తి పాటి పొగ కూడా కానరాదు . సున్నా స్థాయిలో శబ్ద , వాతావరణ కాలుష్యం ఉంటాయన్న మాట. భారత్ లో వాతావరణ కాలుష్యము, నదులు ఎండిపోవడం, నీటికొరత, బేరీజు వేస్తూ ఇక్కడ నాశనం చేసేదీ, అక్కడ అమెరికాలో  పరిరక్షిం చేదీ మనవాళ్ళే, అక్కడ చట్టాల అమలు జరిపే విధానాన్ని చెప్పకనే చేపుతాఋ. ఇక్కడ మనిషి స్వార్ధం గురించి మాట్లాడుతూ లోపలా బయటా కూడా మురికి పట్టిపోయాడు మనిషి అని వాపోతారు. అక్కడి విద్యాసంస్థలను గురుకులాలతో పోల్చడం, అటువంటి ఉన్నత విద్యాసంస్థల గురించి  గురుకుల సంస్కృతి గురించి  అర్ధం కావాలంటే రాహుల్ సాంక్రుత్యాయాన్ రాసిన “సింహ సేనాపతి” చదవాల్సిందేనని సూచిస్తారు. అక్కడ చదువులో పుస్తకం ఒక భాగం మాత్రమే, ఇక్కడ చదువంటేనే బండెడు పుస్తకాలు. ఆట,పాట, వినోదం, రాజకీయం,సమాజ సేవ, రచన వ్యాపారజ్ఞానం, సమకాలీన వైజ్ఞానిక అంశాలు అక్కడి బడులలో ప్రధాన సిలబస్ . పిల్లల పెంపకం లో నిర్లక్ష్యం చూపితే తల్లితండ్రులకు శిక్షలు తప్పదు.
           నరసింహ మూర్తి గారు మొదట బస చేసిన ప్రధాన పట్టణం కార్లయిల్ దగ్గర ఉన్న కాంకర్డ్ సిటీ. అక్కడ ప్రసిద్ధ అమెరికా కవులైన ఎమర్సన్ , థారోల  స్మారక సంగ్రహాలయాలున్నాయి. వారు అక్కడ నివసించిన ఆనవాళ్ళను చూసి మురియిపోతారు మన కవిగారు, వాటిని వారు  పుణ్య క్షేత్రాలుగా కొలవడం చూసి  మన కవులకు పట్టిన దుస్థితిని బేరీజు వేస్తారు. మన సంప్రదాయం కాదని మనం చులకనగా చూసే మదర్స్ డే, ఫాదర్స్ డే లను జరుపుకోవడంలోని అసలు రహస్యార్ధాన్ని వివరిస్తూ, వారు వారి తల్లితండ్రులను ఎంతగానో ప్రేమిస్తారని ఇతరులుకూడా అదేవిధంగా ప్రేమించాలని గుర్తుచేయడంలో భాగంగా ఆ పండుగులని జరుపు కుంటారాణి వివరిస్తారు. అమెరికా ప్రజలు పూలను ఎక్కువగా ప్రేమిస్తారు,పూలవంటి ప్రజలను ఇంకా ఎక్కువ ప్రేమిస్తారంటూ వసంతంలో అమెరిక పరిసరాల్లో పూస్తున్న ఎన్నో రకరకాల పూలను , రైతులు పండిస్తున్న సుమారు పాతిక రకాల పండ్ల ను పేర్లతో సహా  మనకు పరిచయం చేస్తారు.
              ఆయన సందర్శించిన హార్వర్డ్ , నార్త్ ఈస్తర్న్ యునివర్సిటీ, ప్రతిష్టాత్మకమైన మాస్సుచుస్సిట్ ఇన్స్టిట్యుట్ అఫ్ టెక్నాలజీ,  సిలికాన్ ఆంద్ర తెలుగు యునివర్సిటి , స్టాన్ఫోర్డ్ దంపతులు కొడుకు జ్ఞాపకార్ధం నిర్మించిన స్టాన్ఫోర్డ్ యునివర్సిటీ చారిత్రాక నేపధ్యాన్ని అక్కడ నుండే ఆవిర్భవించిన ప్రపంచ మేధావుల గురించి ప్రస్తావిస్తారు. ఆయా విశ్వ విద్యాలయాల గ్రంధాలయాలను దర్శించడమే కాకుండా ఎప్పటినుంచో తనకున్న సాహిత్యంలోని అను మానాలను నివృతి చేసుకునేందుకు పుస్తకాలను తీసుక పోయి అధ్యయనం చేయడం విచిత్రం. కొన్ని గ్రంధాలయాలకు భూగర్భంలోంచి సొరంగ రహదార్లు ఉండడం ఆశ్చర్యం కలుగుతుంది. వాతావరణం అనుకూలించని సమయాల్లో విద్యార్ధులు అ సోరంగా మార్గం గుండా తరగతి గదుల నుండీ , వారి వారి హాస్టల్స్ నుండీ అటూ ఇటూ తిరిగి చేరుకుంటారు.
                 నదుల పరిరక్షణ, నదీ జలాల సక్రమ వినియోగం, నీటి విలువ, నీటి కాలుష్య నివారణ అమెరికన్లను చూసి నేర్చుకోవాలంటారు, నరసింహమూర్తి గారు. బోస్టన్ నగరాన్ని కేంబ్రిడ్జ్ ను కలుపుతున్న చార్లెస్ నది ని , ప్రతిష్టాత్మకమైన అమెరికన్ల జాతీయ నది అయిన - మిస్సి సిపి నదినీ  దాని పవిత్రతను వారు కాపాడే తీరును , డులత్ లోని ఉన్న లేక్ సుపీరియర్ (ఇది అతి పెద్ద మంచి నేటి సరస్సు) వైశిష్టతను వివరిస్తూ బాణభట్టు “కాడంబరి”లో వివరించిన అచ్చోద సరస్సు ఇదేనంటూ పోలుస్తారు. అచ్చ మైన నీరు కలదని అర్ధం అన్నమాట. లేక్ సుపీరియర్ తో ఏదో తెలియని అజ్ఞాత పూర్వమైన నిబిదానందాన్ని పొందానంతారు. ఆ నదులను ధ్యానిస్తూ తన దేశంలోని ప్రజలకు కూడా నదుల యొక్క గొప్పతనాన్ని, కాపాడుకోవాల్సిన అవసరాన్ని నేర్పాలని, జలవివాదాలను, జలయుద్దాలను నివారించే జ్ఞానాన్ని కలిగించాలని  జలదేవతను కోరుకుంటారు. తన దేశం లో పవిత్రత పేర హారతులు పూవ్వులతో  జరుగుతున్న నదుల కాలుష్యాని ఎద్దేవా చేస్తారు. అక్కడ నదులను మించి చెరువులు కూడా వేల సంఖ్యలో ఉండడాన్ని గుర్తిస్తారు.  ఒక్క మినసోట పట్టణంలోనే సుమారు పదివేల చెరువు లుండి  అన్నీ స్వచ్చంగా ఉండడం ఆశ్చర్యం కలుగుతుంది. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ నుండీ ఈ  ప్రాంతానికి వలస వచ్చిన యురోపియన్లు ప్రక్రుతి అరాధకులు అలాగే సౌందర్య పిపాసకులు. ఈ వలసవాదులు అమెరికాకు చేసిన మేలు ఇంతా అంతా కాదంటారు, రచయిత. ఒక్క నార్వే పట్టణంలోనే  లోనే 30 వేల నదులున్నాయంటే నమ్మశక్యంగా లేదుకదూ? “చాప్లిన్ సరస్సు” మీద ఎండా కాలంలో పడవలు, శీతాకాలం లో గడ్డ కట్టిన అ నీటి మీద కార్లూ లారీలు తిరుతాయంటూ ఆశ్చర్యపోతారు. మినసోట లోని అన్ని నడులున్నాయని తెలుసుకుని “ఇక్కడ ఎక్కడ చూసినా చెరువులే” ద్రాక్షారామాన్ని వర్ణిస్తూ శ్రీనాధుడు భీమేశ్వర పురాణం అన్న వాక్యం యాదికి తెచ్చుకుంటారు.
                  వర్షాలు రైతులు, రైతుల నష్టాలు, రైతు బజార్లు, రైతుల ఉత్పత్తి ఎక్కడైనా ఒకే రీతిలో ఉంటాయి.  అయితే రైతులతో వారి పండించే పంటకు మనంకూడా వాటాదారులుగా పెట్టుబడి పెట్టి చేరి భాగస్వామ్యులు అవడం లాంటివే కూడా ఉన్నాయి. అంతే కాకుండా పంటకూ రైతుకు ఉండే అనుబంధము ఎక్కడైనా ఒక్కటే. అమెరికన్లకు  ఉన్న సంస్కారం, వారసత్వంగా సంక్రమించిన సంప్రదాయ లక్షణాలు, కుంటుంబ వ్యవస్థ, స్నేహాలూ, పరస్పరా భిమానాలు తెలుసుకుంటూ ఉంటే  అమెరికా మీద మనకు గతంలో ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవలసివస్తుంది. అదొక సామ్రాజ్యవాద దేశము గానో విచ్చలవిడి సంస్క్రుతి గల దేశం గానో లేదా అదొక డాలర్ల కోసం వెంపర్లాడే ఆర్దిక వనరు గానో మనకున్న అభిప్రాయం పోయి గౌరవం పెరుగుతుంది.
                 కర్షక జీవన కాస్త నష్టాలు ప్రపంచం మొత్తం ఒకేలా ఉంటాయి, గ్రామాలు ఎక్కడైనా గ్రామాలే అంటారు . గ్రామీణ జీవితాలలో సాధారణంగా మనం విస్మరించే కూరాకులవాళ్ళను గుర్తుచేస్తూ  వాళ్ళు ఆకుకూరలను కాయగూరను పళ్ళనూ పూలనూ ఎంతలా ప్రేమిస్తారో వివరిస్తూ పింగళి కాటూరి “కవితా సామగ్రి “ ఖండిక ను గుర్తుచేస్తూ  జానపదాలను  స్పృశిస్తారు. దువ్వూరి,కాటూరి, తుమ్మల, ఏటుకూరి కవిత్వాల్లో పల్లవించిన పల్లెసీమల అందాలను కర్షక జీవన తీరు తియ్యలను, జీవన తత్వాలనూ, పల్లెపట్టుల పోడిమినీ అర్ధం అయ్యేలా వివరిస్తారు. మనకు అభ్యుదయ కవులోచ్చిన  తర్వాత ఆ అందాలన్నీ చెడిపోయాయి, భాష ధ్వంసం అయ్యింది, ప్రపంచీకరణలో కొట్టుకుపోయామని వాపోతారు.  కాలిఫోర్నియాలో ఉన్న  “డెత్ వ్యాలీ” అంటే మృత్యు లోయ గురించి ఆయన వివరించిన తీరు చదితేనే బాగుంటుంది. అక్కడ గలిగే అనుభవాన్ని “స్వర్గ నరకాల చాయా దేహళి” గా వర్ణిస్తారు. “కవిత, కొత్త అనుభవాలకు కాంతి పేటిక తెరవాలనే” తిలక్ ఆలోచనతో ఏకీభవిస్తూ గ్రహించే మనసు ఉండాలే గానీ జీవితంలో ప్రతీ చరణ విన్యాసం లోనూ ఒక కొత్త అనుభవం పొంచి ఉందంటారు నరసింహ మూర్తి గారు .
               అమెరికాలోనైనా అమలాపురంలోనైనా తెలుగువాళ్ళు తెలుగువాళ్ళే, మారారు అంటూ అమెరికాలోని గుళ్ళూ, భక్తి,స్వామీజీలు, పురోహితుల దోపిడీ, వాస్తు, సంఖ్యా జోతిష్య శాస్త్రాల స్పెషలిస్టుల ప్రహాసనాలు, చిన జీయర్ల గురుకుల వ్యాపారాలు, కుల మ్యారేజి బ్యూరోలు లాంటి వాటిని విమర్శిస్తూ “వెర్రి వెర్రి పురాణ గాధల నమ్మజేల్లునే పండితుల్” అంటూ , గీతాచార్యుడు చెప్పిన” చాతుర్వర్ణం మాయో సృష్టం,,” అన్న మాట స్థిర పడిపోయి “ఎల్ల లోకములొక్క ఇల్లై వర్ణభేదము లెల్ల కల్లై” అనే మాట అంతరాల్లో కలిసిపోతుందేమోనని భయపడతారు. ఇంతకీ అమెరికాలోని తెలుగువారిది పురోగమనమా? తిరోగమనం? అంటూ, “వీడి పిండం పిల్లులకు పెట్ట , త్రోవ ఆటా? ఇటా ?” అనే అగ్నిహోత్రావధాని  సందిగ్ధని వ్యక్త పరుస్తారు.
         వలస వాదులైన బ్రిటీష్ వారు తూర్పునుండీ , మాధ్యమం నుండీ స్కాండినేవియన్లు, పశ్చిమం నుండీ ఫ్రెంచ్ వారు దాడి చేసి దోచుకున్న తీరును రెడ్ ఇండియాన్ల దైన్యతను రేఖామాత్రంగా గుర్తుచేస్తారు. ఈ సందర్భంగా రాబర్ట్ లూయిస్ స్టివన్సన్ రాసిన ట్రెజర్ ఐలాండ్ నవలను  ప్రస్తావిస్తారు. కాలిఫోర్నియాలో పర్యటిస్తున్నప్పుడు  సుమారు 175 కధలు రాసిన  కాలిఫోర్నియా లోని ప్రసిద్ద  కధకుడు ఫ్రాన్సిస్ స్కాట్ ఫిట్జెరాల్డ్ ను  గుర్తు చేసుకుంటారు. బోస్టన్, కేంబ్రిడ్జ్ మధ్య ప్రయాణం చేస్త్న్నప్పుడు చార్లెస్ డికెన్స్  “ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్”  లండన్ పారిస్ గురించి రాసిన నవల పోల్చి చూస్తారు. చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర లోని బోస్టన్ టీ పార్టీ ప్రస్తావించడం మనలిని  మరింత ముగ్ధుల్ని చేస్తుంది.   సన్నిహిత మిత్రులను కలిసినప్పుడు భాష, సాహిత్యం పై జరిగిన చర్చలు కూడా ఏకపక్షంగా కాక హృద్యంగా జరిగినట్లు, అక్కడ సాహితీ ప్రియులు ఎక్కువగా ఉన్నట్లు  సహృదయతతో  వీరిని ఆదరించినట్లు ఆయన మాటల్లో కనబడతాయి. వారి చర్చల్లో కర్ణాటకలోని హేగ్గోడు లాంటి అతి చిన్న ఊరు గురించి మాట్లాడుకోవడం ఆసక్తిగా ఉంది. మూర్తిగారు అమెరికాలో ఎవరింటికి వెళ్ళినా  అక్కడ పెంపుడు కుక్కల ప్రహాసనం ,వాటితో ఆయన అనుభవం “ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చుననే” ఏక సూత్రంతో ఈయన ప్రేమను  నటించడం చిలిపిగా అనిపిస్తాయి. ఈ ప్రయాణంలో మూర్తి గారు తన బాల్యాన్నీ, చిన్ననాటి చిరు కోరికలను , యవ్వనపు ఆలోచనలను, జీవితము మరెన్నో కోల్పోయామనుకున్న చిన్ని చిన్ని ఆనందాలను అనుభవించి పరవశిస్తారు.
             ఒక నూతన ప్రదేశాన్ని లేదా క్రొత్త దేశ  పర్యటనలోని పరమార్ధాన్నిఎలా విజ్ఞాన వంతంగా సఫలీకృతం చేసుకోవాలో తెలియాలంటే ఈ రచన చదవాల్సిందే. ఒక దేశాన్ని కొలవడం లేదా తూనిక పట్టడం అంటే ఏమిటో ఎలాగో వివరిస్తారు. పర్యాటనల ద్వారా జరిగే ఆత్మ క్షాళన గురించి తాత్వికంగా ఆవిష్కరిస్తారు. ఊహించని ఆత్మానందాన్నిఅందించడం లోనూ ,అనూహ్య ప్రశాంతతకు పర్యాటనలు ఎలా దోహద పడతాయో, ఏ తీరుగా చూడాలో అంతర్లీనంగా తెలియచేసే పుస్తకం “వసంతం నుదీ శిశిరం వరకూ “ . వసంతానికి వివక్ష ఉండదు. ద్రుష్టి కోణానికీ వివక్ష ఉండకూడదు. యాత్రా సాహిత్యానికి భావుకతను  , సౌదర్య శాస్త్రాన్ని అద్ది , విమర్శనాత్మక దృష్టితో చూసి, అధ్యాత్మికను జోడించి, తాత్వికతతో రాస్తే ఈ రచన తయారైందని పిస్తుంది. ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ కృష్ణ శాస్త్రి, కాళిదాసు కలిసి రాసిన గ్రంధానికి శ్రీశ్రీ సరి చేసి తిలక్ ఆవిష్కరించిన అనుభూతి కలుగుతుందనడంలో సందేహం లేదు.
               అమెరికా భౌగోళిక ఆర్ధిక సామాజిక సాంస్కృతిక విద్యా సాహిత్య అంశాలను తెలుసుకోవడం ఒక ఎత్తైతే కధనాన్ని వివరించే మెళకువలు, ఏది అవసరమైన చర్చించ దగ్గ విషయము, వ్యక్తిగత  విషయాన్ని ఎంత లోతు వరకూ చెప్పవచ్చు , విషయానికి ఎంత విజ్ఞానాన్ని జోడించ వచ్చు, అనుభవాలను ఆకర్షనీయంగా మలిచే తీరును తెలుసుకునేందుకు ఈ రచన ఉపయోగించుకోవడం మరొక ఎత్తు.  నరసింహమూర్తి గారి తన జీవితంలో అత్యంత ఉత్సాహభరితమైన ఉల్లాసవంతమైన వసంతాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ అక్కడితో ఆగలేదు. సమయానుకూలంగా గుర్తుకొచ్చిన ఆపాట మధుర సినీ గీతాలను పాడుకుంటూ గడుపుతారి. అక్కడితో కూడా ఆగకుండా  వసంతం మీద అమెరికన్ కవులు ఎమెర్సన్,  జాతీయ కవి వాల్ట్ విట్మన్, కమ్మిన్స్, రాబర్ట్ ఫ్రాస్ట్ మొదలైన వారు రాసిన కవితల్ని తెలుగులోనికి స్వయంగా అనువదించి ఈ పుస్తకానికి చేర్చి మరిన్ని  సాహిత్య విలువలను పొందుపరిచారు. మనుగడ లోని ఉన్న అన్ని సాహిత్య ప్రక్రియల్లోనో అనూహ్యమైన ప్రతిభావంతుడైన యు.ఎ.ఎన్.మూర్తి గారికి మరణానంతరం 2019 మోజయిక్ సాహిత్య పురస్కారం అందించడం ఎన్నో  పెద్ద పురస్కారాలు అందుకోవాల్సిన వారికి కంటి తుడుపే అయినా సంస్థ పేరు ఇనుమడింప బడింది. ఈ విషయంలో మోజైక్ సంస్థను అభినందించి తీరాలి.                                               

                                                              డాక్టర్ మాటూరి శ్రీనివాస్ (24-04-19)

No comments:

Post a Comment