Friday, 10 April 2020

జోగిని ..



ఆ అందాలన్నీ ఆలయాల్లో అవసరాల అనామకాలు
రంగం సిద్దమైనప్పుడు దేవతల పూజల పేరుతో ప్రాణమున్న నైవేద్యలౌతారు
నేరుగా  చాప మీద నుండీ మంచం మీదికి ఎగుమతి చేయబడతాయి  ,
 విరిసి మెరియాల్సిన పసి మొగ్గలు
కసురుగానే కాటేయబడతాయి, కాసులతో కొనబడతాయి
పురోహితుడి కోరికలకు గుర్రాలై దాహం తీరుస్తూ
మారుతూ సవారీ చేస్తున్న కామాంధ రౌతుల్ని ఆవలి తీరానికి చేరుస్తారు  
అప్పుడప్పుడు ఈ మానవాకారాలు పూనకాల పరవశం తో
వేపకొమ్మలు చేతపట్టిన పసుపు ముద్దలౌతారు  
దేవుడితో  పెళ్లి, గడతో బాసికం, గుళ్ళో దొంగ నాయాళ్ళు ఎవరో తాళి కడితే
ఊరందరికీ పడకై పోతారు ఇక, జీవితమంతా    శోభనం తో  ఉరి  
మనువు తన కామ పరాచికాల కోసం ఒక కులాన్నే పుట్టించాడు
తన ఆకలికి చీకటిని జోడించడం, మాతృత్వాన్ని ఓడించడం  
ఎవడి భోగం కోసం  దిక్కుమాలిన సామాజిక దుఃఖ రోగాన్ని అంటించాడు  
ఒక్కో రాత్రి చీకటి చిరునామాగా సంచరిస్తూ వాడిన మల్లెపూవు అవుతుంది
 బలిసిన భూస్వామి నాగలి కర్రును భరించిన నిశ్శబ్దపు నేలౌతుంది
 స్వాభిమానాన్ని మర్చిపోయిన అవమానాల శరీరం వీధుల్లో
 తన తానూ పరుచుకుంటూ అమానుష వృత్తికి  బలైంది
ఆ దేహం ఇప్పుడు మతం రాసిన  మరణ శాసనానికి ఆసనం    
మెల్లగా గుళ్ళో మొదలైన ఆట రోడ్డెక్కి అర్ధరాత్రి పాటైంది .




……









No comments:

Post a Comment