Friday, 10 April 2020

నాగరికత


నాగరికత

సృష్టికి  ఉనికిని నిలిపిన   చరిత్రకు పునాదివి .
మానవ మేధకు  బహు ముఖమైన జ్ఞాన శిఖవి.
ఓ! సంస్కారపు ప్రాతః చిరునామా-
  పుటల్లో పొదుగుతూ ఎదుగుతున్న
రేపటి సత్యానికి  ఆయువు పట్టు ,నీవు .
ఆల్చిప్పలో పడి వాడిగా  వడిగా గట్టిపడుతున్న నిత్య సత్య ముత్యానివి .
సహజ ప్రకృతి విలువకు ఓనమాలు   నేర్పిన
అవసరాల వివేచనా చైతన్యానివి నీవు..
 వనరుల అనూహ్య శక్తిని పసిగట్టించి
మాచేత అద్భుతాలు సృష్తించి,నర్తించిన
నిరంతర జీవ పరిణామ నాట్య విన్యాసానివి , నీవు  .
పయనాల వైనం.
వైనాల పయనం .
శిధిలాల గమనం
చైత్యాల వదనం నీవే !
ఆనవాళ్ళమోడు లైన చదును బతుకుల కు పదును
 పెడుతూ పరుగులులెడుతున్న  నిన్నటిని 
నేటితో  నమోదు చేస్తున్న రేపటి పునాది కలలరేడు. .
తర తరాల తరగని ,చెరగని నిక్షిప్త బంగారు గని
చరిత్ర  పాథశాల . చరిత్రకారుల పానసాల .
ధ్వంస రచనకు ఆలవాలమైన అందాల హరివిల్లు
అష్టా దశ  పురాణాలు దాని కాలి గోళ్ళు .
ఆధారాల ఆధరాల పూర్వ తరాల అనుభవాల సమూహాల సవ్యసాచి.  
భవిషత్ తరాల భావి దిక్సూచి,
నాటి నుండీ నేటి లోనికి,
నేటి నుండి రేపటిలోకి  పయనిస్తున్న అవిర్భావాల పల్లకి
మానవ జాతికి  మహోత్తర చోదక శక్తి ,
నిరంతర శత్రుభయంతో చిరాయువు కోసం తపిస్తూ
క్షణ క్షణం బలపడుతూ
చాందస హీనుల్ని భయపెడుతూ
బయల్పడిన సింధు వొడిలోని  మొహంజదారో మొహానివో
 , యుఫ్రటిస్ ,టైగ్రిస్ ల సుమేరియా బంధువో
నవ్య నదుల నేపధ్యపు బాబిలోనియా బృందావని వో
 మెసొపొటేమియా కావ్య అందాల విందువో 
 ‘నాగరికత’ –నీకు వేనవేల సుగంధ చందనాల వందనాలు .      
                                                                    డాక్టర్ మాటూరి శ్రీనివాస్

No comments:

Post a Comment